కోనసీమ జిల్లా మార్పు అంశంలో అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్ చదివారని ఆమె ఆరోపించారు. కోనసీమ కోసం ఆత్మహత్య చేసుకుంటానన్న అన్యం సాయి అనే వ్యక్తి జనసేన కార్యకర్తేనని రోజా విమర్శలు చేశారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని గతంలో ప్రతిపక్షాలు అంగీకరించాయని ఆమె గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.
అటు అమలాపురం అల్లర్లలో సంఘ విద్రోహ శక్తులతో పాటు రౌడీ షీటర్లు కూడా ఉన్నారని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. అల్లర్లలో గతంలో ఏడుకు పైగా కేసులు నమోదైన వారు 72 మంది ఉన్నారని ఆమె వెల్లడించారు. వీరిలో ఇప్పటిదాకా 46 మందిని అరెస్ట్ చేశామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రకటించారు. జిల్లాలో మరోమారు ఆందోళనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించామని పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబు ఇళ్లపై దాడికి దిగిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.