ఏపీలో పీఆర్సీ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోలు ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేవంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమ్మె సైరన్ మోగించేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎవరి ప్రోద్బలంతో నో, భావోద్వేగంతోనో కాకుండా సంయమనంతో ఆలోచించాలని కోరుకుంటున్నామన్నారు.
ఉద్యోగుల పట్ల సానుభూతి ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించారని, మంచి మనసుతో ఆలోచించాలని ఉద్యోగులను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకోవాలనే సీఎం తాపత్రయపడుతున్నారని ఆయన వెల్లడించారు. గత్యంతరం లేని ఆర్ధిక పరిస్థితుల వల్లే చేయలేకపోతున్నారని, కన్నబిడ్డల కోరికలు తీర్చలేని పరిస్థితిలో కన్నతల్లి దండ్రులు పడే ఆవేదన సీఎం పడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.