PeddiReddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని… పుంగనూరులో తనపై పోటీకి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబుకు ఈ దఫా డిపాజిట్ రావడం కుడా కష్టమేనన్నారు. తన మానసిక పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు ఒకసారి వైద్యులను కలిసి చూపించుకుంటే మంచిదన్నారు. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో తాను చూస్తానన్నారు.
Read Also: IT Companies Q3 Performance: సంతోషంగా సెండాఫ్.. ఆనందంగా ఆహ్వానం..
అటు చంద్రబాబు నోటికి వచ్చినట్లు కారుకూతలు కూస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం, తన ఎల్లో మీడియా కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు. పుంగనూరులో చంద్రబాబు ఏం పీకలేడని.. కుప్పంలో ఆయన జెండాను శాశ్వతంగా పీకేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ జెండాను మోయమని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు అజెండాను అప్పగించాడని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చి పదేపదే తన గురించి మాట్లాడుతున్నాడని.. తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని.. చంద్రబాబు సొంత మనుషుల కోసం పనిచేస్తున్నాడని చురకలు అంటించారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తామని పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాను వదిలి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయాడన్నారు. తమ పక్షాన ప్రజలు ఉన్నంత కాలం తమ పని అయిపోదని.. జిల్లాలో తమపై పైచేయి సాధించడం చంద్రబాబు వల్ల కాదన్నారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలెవరూ నమ్మరని.. చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయిందన్నారు.