Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. అయితే వారాహి రంగుపై విమర్శలు చెలరేగాయి. పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన వాహనానికి వారాహి అని కాకుండా నారాహి అని పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల సైకో అని ఆరోపించారు. అతడు పగటి వేషగాడు.. పిరికి సన్నాసి అని వ్యాఖ్యానించారు. పవన్ గురించి తాము మాట్లాడాలా అని ప్రశ్నించారు.
Read Also: Congress Party: ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు
మరోవైపు చంద్రబాబుపైనా మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయినా దిగజారతాడని.. లోకేష్ రాజకీయ శుంఠ అని.. అజ్ఞాని అని.. పప్పు సైకో అని ఎద్దేవా చేశారు. జయహో బీసీ ట్రైలర్ చూసి టీడీపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని.. రేపటి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వైసీపీకి ఇచ్చే మద్దతు చూసి చంద్రబాబుకు మూర్ఛ వస్తుందన్నారు. గత మూడు రోజులుగా బీసీల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో జగన్ 80 వేల మంది బీసీలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు తన 14 ఏళ్ళ హయాంలో ఎంత మంది బీసీలను ప్రజాప్రతినిధులుగా చేశాడో లెక్క తీయగలడా అని నిలదీశారు. చంద్రబాబు దమ్మున్న మగాడు అయితే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే నిలబడతారని చెప్పగలరా అని సూటి ప్రశ్న వేశారు. పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉంటారని, తానే సీఎం అభ్యర్థిని అని చెప్పగలడా అని ప్రశ్నించారు. వీళ్లంతా సిగ్గులేని వాళ్లు అని.. చరిత్రలో ధీరుడిగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఆరోపించారు.