దావోస్ పర్యటన వివరాల గురించి ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం సాయంత్రం విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే తాము దావోస్‌కు వెళ్లామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్‌లో వివరించామని.. సుమారు 50 ఎమ్మెన్సీ కంపెనీలతో చర్చలు జరిగినట్లు ఆయన వివరించారు. అయితే విశాఖ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయిలో ఎంతగా దెబ్బతీయాలో కొందరు అంత ప్రయత్నం చేశారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు.
దావోస్ వేదికగా జరిగిన చర్చల్లో ఓ MNC ప్రతినిధి తన దగ్గర తీసుకుని వచ్చి విశాఖ ఇమేజ్ విషయంపై ప్రస్తావించగానే తాను నిర్ఘాంతపోయానని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తే విశాఖ మునిగిపోతుందట.. అక్కడ పెట్టుబడులు ఏ విధంగా సాధ్యమని ఓ కంపెనీ ప్రతినిధి ప్రశ్నించారని చెప్పారు. తమ ప్రభుత్వంపై విషం చిమ్మినా.. తమ పార్టీపై విషం చిమ్మినా ఊరుకుంటాం కానీ ప్రాంతాలపై విషప్రచారం చేసేవారిని ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖ నగర ప్రతిష్టను దెబ్బతీయవద్దని అందరినీ వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పారిశ్రామిక, ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ ఆటో పైలెట్ మోడ్‌లో ఉందని.. పెట్టుబడులను ఆకర్షించడంలో తాము ఎవరితోనూ పోటీ పెట్టుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచ దేశాలకు ఏపీ దిక్సూచిగా నిలవనుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటికే సీఎం జగన్ శంకుస్టాపన చేసిన గ్రీన్ కో రెనూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా 5 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుందని తెలిపారు. కర్నూలు గ్రీన్ కో ఎనర్జీ ప్లాంట్ మాదిరే రాష్ట్రంలోని మరో 29 ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను గుర్తించామన్న మంత్రి… అవన్నీ అందుబాటులోకి వస్తే… ఒక్క ఏపీ నుంచే 30 వేలకు పైగా మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు.
కాగా ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించాల్సి ఉండటంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.