శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కెబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమ్మ ఒడి నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారని తెలిపారు. అటు క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆక్వా రైతులకు సబ్సిడీని మరింత మందికి వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని కేబినెట్ తెలిపిందన్నారు. 10 ఎకరాల వరకు ఆక్వాసాగు చేసుకునే రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తామన్నారు.
మరోవైపు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినా ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర్మన్‌లే కొనసాగుతారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతమున్న జెడ్పీ ఛైర్మన్లనే వారి కాలపరిమితి ముగిసే దాకా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. డిసిప్లీనరీ ప్రొసిడీంగ్స్ ట్రిబ్యునల్‌ను రద్దు చేశామన్నారు. రాజ్ భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గండికోటలో టూరిజం శాఖకు 1600 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా పేదలను పేదరికం నుంచి బయట పడేయడమే సీఎం జగన్ లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అప్పు అడిగే కుటుంబమే లేదని.. ప్రతి పేద కుటుంబానికీ సంక్షేమ ఫలితాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. దుల్హన్ పథకం లబ్దిదారులకు వేరే రూపంలో లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.