పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకవ్వడంపై టీడీపీ ప్రధాన కార్యకర్శి నారా లోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే! వైసీపీ వ్యాట్సాప్ గ్రూపుల్లోనే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ ఆరోపణలు చేసిన ఆయన, పదో తరగతి పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అంతేకాదు, దేశ చరిత్రలోనే దీన్నో చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణను తొలగించాలని డిమాండ్ కూడా చేశారు.
Read Also: Andhra Pradesh: రంగంలోకి పీఆర్ కాంట్రాక్టర్లు.. హామీ ఇచ్చిన ఈఎన్సీ
ఈ నేపథ్యంలోనే లోకేష్ లేఖకు బొత్స సీరియస్‌గా స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా తాము పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన.. తల్లిదండ్రులు, విద్యార్థుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దన్నారు. గత ప్రభుత్వంలో మాస్ కాపీయింగ్ జరిగినా, ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోని పరిస్థితిని చూశామన్నారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం సుమారు 60 మందిపై చర్యలు తీసుకుందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక ప్రభుత్వ ఉపాధ్యాయులే 30 నుంచి 35 మంది వరకు ఉన్నారన్నారు. వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. క్రిమినల్ కేసులూ పెట్టామన్నారు.
ఈ విషయంపై ప్రతిపక్షాలు చేస్తోన్న నానాయాగీ చూస్తుంటే.. పకడ్బందీగా చర్యలు తీసుకోవడం ఇష్టం లేనట్టుందని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఐదుగురు టీచర్లు ఆన్సర్ షీట్ తయారు చేస్తుంటే, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. తప్పును ఉపేక్షించేదే లేదని.. ప్రభుత్వంలో ఉన్నవారైనా, ప్రైవేటు అయినా తమకు ఒక్కటేనన్నారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఆకాంక్షతోనే ఉపాధ్యాయులకు లక్ష్యాలు విధించామని చెప్పారు. గడిచిన ఐదు రోజుల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ గానీ, పేపర్ లీక్ గానీ జరుగలేదని బొత్స అన్నారు.
తాము చర్యలు తీసుకున్న ఉపాధ్యాయుల్లో.. 22 మంది నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు స్కూల్స్‌కు చెందినవాళ్లే ఉన్నారన్నారు. ఒకవేళ మాస్ కాపీయింగ్‌లో స్కూళ్ల యాజమాన్యం పాత్ర ఉంటే, ఆయా స్కూళ్లను పరీక్ష కేంద్రం లేకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. తమ బాధ్యతకు తమకు బాగా తెలుసని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. రహస్యంగా సెల్‌ఫోన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి, స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశామని బొత్స సత్యనారాయణ చెప్పారు.