Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొడుతోంది చంద్రబాబేనని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన ఖర్మ అన్నారు. గత 60 ఏళ్ళుగా గురువులను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తోందని.. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి గురువులను స్మరించుకుంటూ ఉంటారని.. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సత్కరించారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని.. ఆయన పరిస్థితి చూస్తే జాలేస్తోందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు మానవత్వం లేదని.. సమయం, సందర్భం లేదని మంత్రి బొత్స విమర్శలు చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవంపై చంద్రబాబు వ్యవహారశైలిని నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు సెప్టెంబర్ 5 గౌరవ ప్రదమైన రోజు కాదని.. ఆయన వెన్నుపోటు పొడిచిన రోజు అని పేర్కొన్నారు. చంద్రబాబుకు కొన్ని మీడియా సంస్థల అధిపతులు గురువులు అని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల కోసం పాత పెన్షన్ విధానం తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. అయితే ఈ పని ఎలా చేయగలం అని చర్చలు జరుపుతున్నామని బొత్స చెప్పారు. చంద్రబాబుది గురువింద గింజ సామెత లాంటి వ్యవహారం అని మండిపడ్డారు. ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు ప్రస్తావిస్తున్నాడని.. చంద్రబాబుకు ఉచ్ఛం నీచం ఉందా అని ప్రశ్నించారు. తాము కూడా ఆయన భార్య, కోడలి పేర్లు చెబితే ఎలా ఉంటుందని నిలదీశారు. ఆయన ఇంట్లో ఆడవాళ్లంటే ఒకటి.. వేరే ఇంటి మహిళలు అంటే మరో తీరా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా 40 ఏళ్ల రాజకీయ పరిణతి అని చురకలు అంటించారు.
Read Also: జీవిత భాగస్వామిని వెతుకుతున్నారా.. ఈ విషయాలను పట్టించుకోవద్దు..
తాము ఉద్యోగుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నామని.. అందుకే సీపీఎస్‌ను విడిచిపెట్టి ఓపీఎస్, జీపీఎస్లపై కసరత్తు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. సీపీఎస్ అనేది ఉద్యోగులకు మేలు చేసేది కాదని గుర్తించామన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా మేలు జరిగేలా ప్రయత్నం చేస్తున్నామని బొత్స తెలిపారు. బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంఘ నాయకులను చూస్తే జాలి వేస్తోందన్నారు. ప్రభుత్వం మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటే దాన్ని వద్దని సంఘాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆలోచనల స్థాయి తక్కువగా ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. 5,600 తరగతులను విలీనం చేస్తున్నాం…స్కూల్స్ విలీనం కాదని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసే సమస్య లేదని.. మూయలేదు కూడా అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ముందు అవగాహన చేసుకుని ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడాలని హితవు పలికారు. ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని.. దానిలో ఒకటి మహిళలకు పెట్టామన్నారు. గతంలో ఇలాంటి సంస్కరణలు ఎందుకు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబు ఎంతసేపు నారాయణ, చైతన్య బాగుపడాలని.. గవర్నమెంట్ స్కూల్ మూసివేయాలని కోరుకుంటాడని మంత్రి బొత్స ఆరోపించారు. టెన్త్ పరీక్షల్లో చేసినట్లు ఆ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ పరీక్షల్లో ఎందుకు చేయలేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న గట్టి చర్యల వల్లే ఆ తర్వాత జరగలేదన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ విషయంలో ఉపాధ్యాయులు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారని.. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపామని.. అన్నీ పరిష్కరించామని స్పష్టం చేశారు. ఇంకా ఒకటి రెండు సమస్యలు చెప్పారని.. వాటికి కూడా పరిష్కారం చూపుతామన్నారు. ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమలు చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఇద్దరు చొప్పున ఉద్యోగులను పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్క CPS తప్ప ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్య లేదని బొత్స అన్నారు.