అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు.
ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో పాటు విద్య , వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు దేశంలోనే అత్యుత్తమ వాటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నది సీఎం జగన్ విజన్ అని తెలిపారు. ఈ దిశగా యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు పనిచేయాలని సూచించారు. యూనివర్సిటీల్లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి తాను చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.