యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవ కార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర, నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. మాఘమాసంలో అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు. అమ్మవారి స్తోత్ర పారాయణం చేయడం వల్ల అపారమయిన ప్రయోజనాలు కలుగుతాయి. పవిత్ర స్నానాలు చేసి, లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ, అలాగే ‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం…’ అంటూ ప్రారంభమయ్యే ‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’ పారాయణ కూడా విశేష ఫలప్రదం అంటారు మన పెద్దలు.