ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ విద్యావేత్త, ప్రవాసాంధ్రుడు లకిరెడ్డి బాలరెడ్డి (88) అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడంలో జన్మించిన ఆయన పేరుతో ఇంజినీరింగ్ కాలేజీ కూడా నడుస్తోంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. 1960లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేసి అనంతరం అక్కడే ఉద్యోగంలో చేరారు.
Read Also: వైరల్: ఆదర్శంగా నిలుస్తున్న భద్రాద్రి జిల్లా కలెక్టర్
1997లో లకిరెడ్డి బాలరెడ్డి పేరుతో ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. దేవాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు కూడా నిర్మించారు. లకిరెడ్డి బాలరెడ్డి నాయనమ్మ పాపులమ్మ పేరిట హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్‌ను కట్టించారు. వెల్వడం అడ్డరోడ్డులో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. మైలవరంలో రూ.100 కోట్లతో 65 ఎకరాల స్థలంలో లకిరెడ్డి బాలరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించారు. ఆయన తన జీవితంలో కష్టాలను కూడా అనుభవించారు. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా 2000లో అమెరికా న్యాయస్థానం లకిరెడ్డి బాలరెడ్డికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా లకిరెడ్డి బాలరెడ్డి మృతదేహాన్ని ఈనెల 13న ఇండియాకు తీసుకువచ్చి 14న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.