కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పెన్షన్లు, రేషన్ బియ్యం పంపిణీపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రెస్ నోట్ విడుదల చేశారు. అమలాపురం అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో జూన్ 1న బుధవారం నాడు పెన్షన్లను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి ప్రజా పంపిణీ విధానం ద్వారా కార్డుదారులకు బియ్యం వీఆర్వో ధృవీకరణ ద్వారా పంపిణీ జరుగుతుందని వివరించారు.
Minister Gudivada Amarnath: విశాఖ ఇమేజ్‌ను కావాలనే డ్యామేజ్ చేశారు
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లులు ట్రెజరీకి సమర్పించే ప్రక్రియ 95 శాతం పూర్తయిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం కరెంట్ బిల్లులు చెల్లించకపోయినా వారి సర్వీస్ కనెక్షన్‌లను అధికారులు తొలగించరని కలెక్టర్ స్పష్టం చేశారు. అటు మునిసిపాలిటీలలో మంచినీటి కుళాయిల బిల్లులు చెల్లించకపోయినా మంచినీటి సరఫరా నిలిపివేయరన్నారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతర్జాల అనుసంధాన ధృవీకరణకు బదులుగా టెలిఫోన్ అనుసంధాన ధృవీకరణ ద్వారా సేవలు అందుతాయని పేర్కొన్నారు.
కాగా కోనసీమలో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ బంద్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పుకార్లను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మంగళవారం నాడు మరో 9మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ మొత్తం 71మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సఖినేటిపల్లి, మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 48 గంటల పాటు పొడిగించారు.