టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. తుప్పు నాయుడు, పప్పు నాయుడు కుట్రలు పన్నుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా మద్యంలో విషం ఉందని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ల్యాబరేటరీ పని చేసే బాయ్ వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్పాడా.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని బాటిల్ పైనే ఉంటుందని ఆయన వెల్లడించారు. దీనికి వీళ్ళు ల్యాబ్ కు వెళ్లి పరీక్షించేది ఏంటి?? తెలుగు దేశం పార్టీ ఆఫీసుకు వెళ్ళి పరీక్షించారా?? టీడీపీ నాయకులు సగం తాగేసిన బాటిళ్ల నుంచి శాంపిళ్ళు తీసుకుని వెళ్ళారా?? అంటూ ఆయన మండిపడ్డారు.
అరవిందో ఫార్మాస్యూటికల్ 1965 లో పెట్టారని, అరవిందో ఫార్మాస్యూటికల్ మందులు ప్రపంచంలో ఎగుమతి కాని దేశం లేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతర్జాతీయంగా ఆ స్థాయిలో ఎగుమతి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అరవిందో ఫార్మాస్యూటికల్ మందుల్లో విషం కల్పితే అరెస్టు చేసి అంతర్జాతీయ కోర్టుల్లో పెడతారని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డి వియ్యంకుడని చెప్పి విషం చిమ్ముతున్నారని, రేపు బియ్యంలో విషం అంటారు, ఎల్లుండి మంచి నీళ్ళలో విషం అని ప్రచారం చేస్తారు. చంద్రబాబు గోబెల్స్ కు తాత అంటూ కొడాలి నాని విమర్శలు గుప్పించారు.