Kodali Nani Fires on TDP And Janasena: వరదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గోదావరి వరద ప్రాంతంలో సీఎం జగన్ పునరావాసం ఏర్పాటు చేశారని కొడాలి నాని వెల్లడించారు. బాధితులకు ఆహారం, నీరు అందించడం సహా కుటుంబానికి రూ.2 వేలు ఇచ్చారన్నారు. వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఒక్కో కలెక్టర్‌కు రూ. 6-8 కోట్లు కేటాయించి సహాయ కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు కూడా ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఇలాగే ఆరోపణలు చేశారని.. స్వయంగా సీఎం వెళ్లి సమస్యలు పరిష్కరించారని గుర్తుచేశారు. గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని పేర్కొన్నారు. త్వరలో సీఎం జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. గ్రామాల్లో తిరిగి సమస్యలు, లోటు పాట్లు తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరిస్తారని కొడాలి నాని అన్నారు.
Read Also: Godavari Sea Water Colours: నీరంగు నీదే.. నా రంగు నాదే
కాగా రోడ్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు కూడా కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. భారత దేశంలో 10-20 శాతం రోడ్ల గోతులు సహజంగానే ఉంటాయని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా రోడ్లు పోయేవి పోతుంటాయి, వేసేవి వేస్తుంటారని కొడాలి నాని చెప్పారు. రోడ్లపై పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం చేపట్టారని.. పవన్ కళ్యాణ్‌ను తాను అడుగుతున్నానని.. ఏ రాష్ట్రానికైనా వెళదాం.. 10 శాతం రోడ్లు కచ్చితంగా దెబ్బతిని ఉంటాయి.. చూపిస్తానని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్లపై గోతులు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎంను కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరతానన్నారు. నిరూపించలేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని కొడాలి నాని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలోనూఏ జర్నలిస్ట్ కాలనీ సహా పలు చోట్ల రోడ్లపై గోతులు పడ్డాయన్నారు. హైదరాబాద్ – విజయవాడ హైవేపైనా గోతులు దర్శనమిస్తాయన్నారు. రాష్ట్రంలో రోడ్ల పై విమర్శించే వారికి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల దుస్థితి కనిపించదా అని నిలదీశారు. శాసన సభకు రానని శపథం చేసిన చంద్రబాబు ఈరోజు శాసన సభకు వచ్చారని.. చంద్రబాబుకు తన భార్య విషయంలో చేసిన శపథం కంటే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ఎక్కువైందా అని ప్రశ్నించారు. చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారని.. ఆయన మాటను ఎవరూ నమ్మరన్నారు.