భారీవర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్ర దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో గోదావరి నీరు.. సాగర జలాలు విడివిడి రంగులతో కనువిందు చేస్తున్నాయి. అద్భుతమైన ఈ దృశ్యం ఏటా వరదలు సీజన్ లో కనిపిస్తూ వుంటుంది. అయితే, గత పది రోజులుగా గోదావరి వరద ముంచెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది.
నాసిక్ లో పుట్టిన గోదారమ్మ మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు వచ్చి.. అక్కడ భద్రాద్రి రాముడి పాదాలు తాకి అక్కడినించి గోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తోంది. గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుండి సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్న వరద నీరు విడివిడిగానే కనిపిస్తుంది. నేనేం తగ్గేదేలే అన్న పుష్ప డైలాగ్ లా …నిన్ను కలవనిచ్చేదేలే అన్నట్టు గోదావరి నీటిని విడిగానే చూస్తోంది సాగరం. ఎన్ని నదులు ఎంత దూరం ప్రయాణించినా.. చివరకు సముద్రుడి ఒడిలో ఒదిగి పోవాల్సిందే. ఎంత పెద్ద మహానది అయినా సాగరానికి లోకువే. నది నీరు తీయగా వున్నా.. సముద్రంలో కలిశాక దాని స్వభావం, రుచిని కోల్పోతుంది.
నీరు ఉప్పగా మారిపోతుంది. సముద్రంలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. నీలి సముద్రం కాస్తా ఎర్ర సముద్రంగా మారిపోయింది. కెరటాలు ఎర్రగా ఎగిసి పడుతుంటే లోపలి సముద్రం మాత్రం ‘నా రంగు నాదే’ అన్నట్టుగా నీలి రంగు లోనే మెరుస్తోంది. వరదనీరు సముద్రంలో కలవడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అంత వరకు అద్భుతమైన ఈ దృశ్యం గోదావరి జిల్లాల వాసులను కనువిందు చేస్తోంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Hardik Pandya: వరల్డ్ రికార్డ్.. ఆ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడు