టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తర్వాత ఏపీనే నెక్ట్స్ టార్గెట్‌గా బీఆర్‌ఎస్ ఎంచుకుంది. అందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరయ్యేందుకు సంక్రాంతిని ముహూర్తంగా కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్.
Read Also: BRS Kisan Cell: బీఆర్ఎస్ కిసాన్ సెల్‌అధ్యక్షుడిగా కీలక నేత..
అమరావతిలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. 2019లో వైసీపీ గెలుపునకు టీఆర్ఎస్ అన్ని విధాలా సహకరించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి ఏపీ నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో.. ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ మూలాలు ఉన్న నేతలను ఆకర్షించేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. ఏపీ టీడీపీ నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండవల్లికి మంచి పేరుంది. తన వ్యూహంలో భాగంగా ఉండవల్లికి కేసీఆర్ ఆహ్వానం పంపారు. ఏపీకి చెందిన కొందరు నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఏపీ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి తలసాని చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగింది.. అలాగే మరికొంతమందిపై కూడా దృష్టిసారించారు గులాబీపార్టీ బాస్.