Kanna Lakshmi Narayana: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మరోసారి ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. ఇప్పుడు తొలగించిన వాళ్లను గతంలో తానే నియమించానని.. అధ్యక్షుల మార్పు అంశాన్ని అసలు తనతో చర్చించకపోవడం సమంజసం కాదన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమందిని పార్టీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో సోము వీర్రాజు సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. సోము వీర్రాజు వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో చేరారని, దీనికి కూడా వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్-జగన్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని కన్నా ఆరోపించారు. ఏపీలో పవన్ కళ్యాణ్‌ను, తెలంగాణలో బండి సంజయ్‌ను వీక్ చేసేందుకు జగన్, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Waltair Veerayya: రెండు గంటల నలభై నిమిషాల పాటు పూనకాలే…
మరోవైపు ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశామన్నారు. అంతేకాకుండా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఏపీలో కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని.. పవన్‌కు తామంతా అండగా ఉంటామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా త్వరలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.