ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలపైనే చర్చలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలందరూ ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంత్రి జోగి రమేష్ ఈ విషయంపై స్పందించారు. సీఎం జగన్ బలంగా ఉన్నారు కాబట్టే, చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌ని సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కడుగా రాగలడా? అని ప్రశ్నించిన ఆయన.. ఆయనకు కావాల్సింది కూడా పొత్తులేనన్నారు.
బలహీనులైన మనల్ని జగన్ బలవంతుల్ని చేశారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలని ఉద్దేశించి జోగి రమేష్ అన్నారు. రేపు ఏదైనా తేడా జరిగిన జగన్ ఓడిపోయినట్లు కాదని.. 80 శాంత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన మనమంతా ఓడిపోయినట్లని చెప్పారు. 25 మంది మంత్రుల్లో 17 మంత్రులు మనకు ఇచ్చారని, సీఎం జగన్‌లాగా మనకు ఎవరు మంచి చేయరన్నారు. 80% ఉన్న మనల్ని, 20% ఉన్న ప్రతిపక్షాలు ఓడించలేరని తిరిగి నిరూపించాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ స్పూర్తితో పాలన నడుస్తోందని చెప్పిన జోగి రమేష్.. మనమంతా బలం నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది కలిసొచ్చినా, తల్లకిందులుగా తపస్సు చేసినా.. జగన్‌ని అంగుళం కూడా కదపలేరని మనమంతా చెప్పగలగాలని వెల్లడించారు.