దేశ ప్రజల ముఖాల్లో వెలుగు చూడాలని ఆ జవాన్ తాపత్రయం.. దేశ ప్రజలకు వెలుగులు పంచుతూ దీపావళి రోజే ప్రకృతి ప్రకోపానికి బలి కావడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి. ఎప్పుడూ దేశ సేవ కోరేవాడని, ఆ క్రమంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సైనికుడిగా చేరి విధులు నిర్వహిస్తుండగానే అసువులు బాశారు ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన పెద్దావుల కార్తీక్‌కుమార్‌రెడ్డి. కార్తీక్ వయసు 29 ఏళ్ళు. గురువారం సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మనాలి సమీపంలో మంచుకొండలు విరిగి పడిన ఘటనలో కార్తీక్ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.
బంధుమిత్రులు ఆయన ఇంటి వద్ద గుమికూడారు. కార్తీక్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా ములకచెరువుకి చెందిన నారాయణరెడ్డి, సరోజమ్మ దంపతులకు కార్తీక్‌కుమార్‌రెడ్డి, క్రాంతికుమార్‌రెడ్డి ఇద్దరు కుమారులు. తండ్రి ఏడాది కిందట అనారోగ్యంతో మరణించారు. భర్త మృతి చెందినా ఇద్దరు కుమారులను చూసుకొని సరోజమ్మ కాలం గడుపుతున్నారు. ఈ ఏడాది మేలో అన్నయ్య వివాహానికి హాజరయ్యారు. కార్తీక్‌కుమార్‌రెడ్డి మరణించాడన్న విషయం శుక్రవారం సాయంత్రం వరకు బంధువులు ఆమెకు తెలియనివ్వలేదు.
బాల్యం నుంచే అదే ఆకాంక్ష.. కార్తీక్‌కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే చక్కగా చదువుకోవాలని, తాను ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2011లో సైన్యంలో (ఎంఈజీలో) చేరారు. ముంబయిలో సెయిలింగ్(పడవ నడపడం)లో ఉత్తమ ప్రతిభ చూపి పతకం పొందారు. మొదట జమ్మూకశ్మీర్‌లో, ఆ తర్వాత ముంబయిలో పనిచేశారు. అంతలోనే ఇలా దూరం అయ్యాడని కన్నీటి పర్యంతం అవుతున్నారు కుటుంబీకులు. కార్తీక్ వీర మరణం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది.