దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట. ఇంకొకరు మధ్యలో దూరకుండా వారసులను లైన్‌లో పెట్టేందుకు ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారు. అదను చూసి పావులు కదుపుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
కుమారులను ప్రోత్సహిస్తోన్న ఎమ్మెల్యేలు!
కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల కంటే వారి వారసులు రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తనయులను సిద్ధం చేస్తున్నారట. కేవలం జనాల్లోనే ఉండకుండా అధికారక కార్యక్రమాల్లోనూ తనయులకు తర్ఫీదు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. కొన్ని అంశాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దానివల్ల కలిగే లాభ నష్టాలను ఏ విధంగా భేరీజు వేస్తున్నారో దగ్గరుండి గమనిస్తున్నారట. అదే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మధ్యలో ఎవరైనా దూరిపోతారనే భయం?
2024 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. కానీ.. మధ్యలో ఎవరైనా దూరిపోతారనే భయమో ఏమో.. వారసులను చాలా స్పీడ్‌గా నియోజకవర్గాల్లో తిప్పేస్తున్నారు. ఆదమరిస్తే ప్రత్యామ్నాయ నేతలు తయారవుతారన్న భయంతో అదను చూసి తనయులను రాజకీయ అరంగ్రేటం చేయించి.. జనాలకు చేరువ చేస్తున్నారు. ముందే కర్ఛీఫ్ వేసి పదవి పదికాలాల పాటు తమ ఇంట్లోనే ఉండేలా జాగ్రత్త పడుతున్నారు ఎమ్మెల్యేలు.
ఆదోని మున్సిపాలిటీలో ఎమ్మెల్యే తనయుడు చక్రం తిప్పారా?
ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి కుమారుడు జయమనోజ్ రెడ్డి.. నియోజకవర్గంలో ప్రతి అన్ని అంశాల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారట. ఎమ్మెల్యే కొడుకు హోదాలో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కూడా లెక్క చేయడం లేదట. ఇటీవల జరిగిన ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ప్లానింగ్ మొత్తం సాయి మనోజ్‌రెడ్డి చేసినట్టు సమాచారం. 42 మంది కౌన్సిలర్ల గెలుపులో కీలక పాత్ర పోషించారట. ఇదంతా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్‌రెడ్డి తనయుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమోనని చెవులు కొరుక్కుంటున్నారు.
మంత్రాలయంలో ప్రదీప్‌రెడ్డి చురుకైన పాత్ర!
మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్న కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి చురుకుగా ఉన్నారు. ఇక్కడ బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీరెడ్డి ఉన్నా.. యాక్టివ్ రోల్ మాత్రం ప్రదీప్‌దేనట.
నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. ప్రారంభోత్సవాలు.. అధికారిక కార్యక్రమాల్లో ఆకర్షణ ప్రదీపే. కొన్ని విషయాలలో ప్రదీప్‌తో కలిసి చర్చించిన తర్వాతే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో 2024లో బాలనాగిరెడ్డి ప్లేస్‌లో ప్రదీప్‌రెడ్డి పోటీ చేస్తారేమోనని కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
పాణ్యంలో వివాదాల పరిష్కారంలో ఎమ్మెల్యే తనయుడు చురుకు!
ఇక పాణ్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి.. గ్రామ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారట. వివాదాలు తలెత్తితే రెండు పక్షాలతో మాట్లాడి పరిష్కరిస్తున్నారట. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. పనులు ఎలా చేయాలో.. వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో అనధికారికంగా సూచనలు ఇస్తుంటారని చెబుతున్నారు. నియోజకవర్గంలో తనయుడిని రాంభూపాల్‌రెడ్డి ప్రోత్సహిస్తున్న తీరు చూసినవారు.. వారసుడు సిద్ధమవుతున్నాడని ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తున్నారు.
ఎమ్మిగనూరులో కుమారుడి ఎంట్రీ కోసం ఎమ్మెల్యే ఆరాటం!
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన కుమారుడు జగన్ మోహన్‌రెడ్డిని 2019లోనే బరిలో దించాలని చూశారు. కానీ పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు. ఎమ్మెల్యే గెలిచిన కొద్దిరోజులకే రాజీనామా చేస్తానని.. జగన్‌మోహన్‌రెడ్డిని ఉపఎన్నికల్లో గెలిపించుకుంటానని సీఎం జగన్ ముందు ప్రతిపాదించారట. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇంకోసారి గుర్తు చేశారట. ఏదో విధంగా తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని తెగ తపించి పోతున్నారట చెన్నకేశవరెడ్డి. దానికి తగ్గట్టుగానే ఎమ్మిగనూరులో జగన్‌మోహన్‌రెడ్డి తీరిక లేకుండా పర్యటిస్తూ బలం తగ్గకుండా చేసుకుంటున్నారు. మొత్తానికి తండ్రుల ఆశలు నెరవేరుతాయో లేదో కానీ.. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తనయులను తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యేలు తీరు చర్చగా మారుతోంది.