YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు గుంటూరులో పోలీసులు.. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే కాగా.. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా బేఖాతరు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రులు కొడాలి నాని , అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలపై కూడా కేసులు నమోదు చేశారు గుంటూరు పోలీసులు..
Read Also: Off The Record: జగన్ 2.0లో కులాల లెక్కలపై ఆచితూచి అడుగులేస్తున్నారా?
కాగా, వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యంపై రేపు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నజీర్‌ను.. కలవనుంది వైసీపీ నేతల బృందం. జగన్‌కు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు. గవర్నర్‌ను కలవనున్న వైసీపీ బృందంలో.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్.. భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం గుంటూరు మిర్చియార్డ్‌కు జగన్ వెళ్లిన సందర్భంగా… జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారని.. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నా.. పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. అయితే, వైసీపీ నేతలు గవర్నర్‌ను కలవడం అటుంచితే.. జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనపై కేసులు నమోదు చేశారు పోలీసులు.