Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై గట్టిగానే పోస్ట్ మార్టం చేసుకున్న వైసీపీ ఇప్పుడిక దిద్దుబాటు చర్యల్ని ముమ్మరం చేస్తోందట. ఒక్క ఓటమి వంద అనుభవాలు నేర్పుతుందన్నట్లుగా… పార్టీకి ఒక పద్ధతి ప్రకారం టింకరింగ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 2024లో ప్రధానంగా… ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం తమకు అండగా లేకపోవడం వల్లే డ్యామేజ్ తీవ్రత పెరిగిందని గుర్తించి ఆ కోణంలో రిపేర్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు.మొదటి నుంచి వైసీపీలో కాపు నేతలకు ప్రాధాన్యంత ఉన్నా… గత ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆ సామాజికవర్గం దూరమైందని, అందుకే మరోసారి అలాంటిది జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటోందట వైసీపీ అధిష్టానం. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, ఆళ్లనాని, కురసాల కన్నబాబు, ఆమంచి కృష్ణమోహన్ వంటి కాపు లీడర్లు నాడు వైసీపీకి వాయిస్‌లా మారారు. వీరికి తోడు ముద్రగడ పద్మనాభం వంటి కాపు ఉద్యమ నేత అండ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో సామాజికవర్గం మొత్తం పవన్ వెంట నడవటంతో తమకు ఓటమి తప్పలేదని వైసీపీ పెద్దలు అంచనాకు వచ్చారట. ఎన్నికల తర్వాత ఒకరిద్దరు కాపు నేతలు బయటకు వెళ్లినప్పటికి పార్టీకి ఇబ్బంది లేకుండా సెట్ చేసుకుంటున్నట్టు తెలిసింది.
విజయసాయిరెడ్డి వంటి కీలక నేత దూరమైనా…. ఆయన స్థానంలో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబుకు అవకాశం ఇవ్వడం అందులో భాగమేనని అంటున్నారు. అలాగే గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు పార్టీ కాపులకే ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు. గత ఎన్నికల్లో సపోర్ట్ చేయకున్నా…ఇక ముందు కూడా పార్టీలో కాపులకు ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నది జగన్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు వైసీపీ లీడర్స్. అక గతాన్ని చూస్తే… ఏపీలో ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కో పార్టీకి కాపులు మద్దతు ఇస్తారన్న విశ్లేషణలున్నాయి. 1983, 85లో టీడీపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు కాపులు. ఇక 88లో కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా హత్య తర్వాత కాంగ్రెస్ వైపునకు మొగ్గారు. తిరిగి 1994 నాటికి టీడీపీని తమ ఛాయిస్‌గా ఎంచుకున్నారు. 99లో కూడా టీడీపీకే జై కొట్టిన కాపులు 2004లో కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అండగా నిలిచారు. ఇక 2009లో కొత్త పార్టీ ప్రజారాజ్యం వైపుకు టర్న్ అయ్యారు. ఏపీ విభజన తర్వాత 2014లో తిరిగి టీడీపీ మద్దతుగా నిలిచారు. అటు పవన్‌కళ్యాణ్ సారధ్యంలో 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా… మెజార్టీ కాపులు మాత్రం వైసీపీ వెంట నడిచినట్టు చెప్పుకుంటారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ కాపులంతా గంపగుత్తగా టీడీపీ కూటమికి జై కొట్టడంతో భారీ విజయం సాధ్యమైందని లెక్కలు చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు.
ఈ పరిస్థితుల్లో… పార్టీ పదవుల్లో కాపులకు పెద్ద పీట వేయడం ద్వారా తిరిగి వారిని తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహరచన చేస్తున్నారట జగన్. ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కన్నబాబుని నియమించారు. అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. కీలకమైన గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు బొత్స. అటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికే చెందిన గుడివాడ అమర్నాధ్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జిగా మరో కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు,… ఇలా ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ పార్టీ కీలక పదవుల్లో ఎక్కువ శాతం కాపులకే దక్కాయి. రెడ్డి సామాజికవర్గం అండ ఎలాగూ ఉంటుందని లెక్కలేసుకుంటున్న వైసీపీ అధిష్టానం…వారితో పాటు కాపులు తమ తరపున నిలబడితే… గట్టిగానే కొట్టొచ్చన్న అంచనాలో ఉన్నట్టు సమాచారం. కాపులు ఎప్పుడూ ఒకే పార్టీకి సపోర్ట్ చేయరని గత అనుభవాలు చెబుతున్నాయని విశ్లేషించుకుంటున్న వైసీపీ పెద్దలు… ఆ కోణంలోనే పార్టీ కూర్పులో కీలక మార్పులు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈసారి సరైన సమయంలో సరిగ్గా రంగం లోకి దించేలా ముద్రగడ పద్మనాభం ను కూడా గట్టిగానే సిద్ధం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇటీవల ఆయన ఇంటిపై దాడి జరిగినప్పుడు మాట్లాడటం, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వటం కూడా స్ట్రాటజీలో భాగమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కాపు కార్డ్ ఫ్యాన్ పార్టీకి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో, వైసీపీకి ఎంతవరకు కాపు కాస్తారో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.