CM Chandrababu:కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడం ద్వారా రైతులకు ఆదాయం పెంచడంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు… సాగులో పురుగుమందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు… రైతు గౌరవం దేశ గౌరవమన్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125 జయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబుతోపాటు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ఎన్జీరంగా జీవితంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీ రంగా 125వ జయంతితోపాటు వందేమాతరం 150వసంతాల వేడుక ఒకే రోజున వచ్చాయన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారిలో రంగా కూడా ఒకరన్నారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. 33ఏళ్ల వయసులోనే రంగా ఆంధ్రా రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. రైతులకు శిక్షణా పాఠశాల పెట్టి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఒకవైపు దేశంకోసం మరోవైపు రైతులకోసం పోరాడిన మహనీయుడు ఆచార్య ఎన్జీరంగా అని కొనియాడారు. 1964లో వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచెయ్యాలని పార్లమెంట్ లో రంగా చేసిన పోరాటం ఎవరూ మర్చిపోరన్నారు. రంగా పార్లమెంట్ లో ఉన్నంతకాలం దేశంలో రైతులు సుభిక్షంగా ఉంటారని అప్పటి ప్రధాని నెహ్రు అన్నారంటే రైతులకోసం రంగా ఏస్థాయిలో పోరాడారో అర్దమవుతుందన్నారు. ఆచార్య ఎన్జీరంగా స్పూర్తితో గ్రామీణ ఆర్దిక వ్యవస్థపై తాను పి.హెచ్.డి. చేశానన్నారు. దేశంకోసం పిల్లలు వద్దనుకున్న రంగా దంపతులు ఆదర్శనీయులన్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయం పెంచడంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రైతులకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. అన్నదాతా సుఖీభవ పథకం కోసం 3వేలకోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం పంటభీమా ప్రీమియం కూడా చెల్లించలేదని మండిపడ్డారు. అందువల్లే రైతులకు పంటనష్టం పరిహారం అందలేదన్నారు. సాంకేతికతసాయంతో మొంథా తుఫాన్ కారణంగా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయన్నారు. వ్యవసాయంలో పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగిపోవడంపైఆందోళన వ్యక్తం చేశారు. పురుగుమందుల వాడకం పెంచి పంజాబ్ రైతులు అనారోగ్యాలపాలయ్యారని గుర్తుచేశారు. అందుకే రైతులు పురుగుమందుల వాడకం తగ్గించాలని సూచించారు. రైతు గౌరవమే దేశ గౌరవమన్న రంగా చెప్పిన మాటలు అక్షరసత్యమన్నారు.
ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు రైతులకోసం రంగా చేసిన సేవలను గుర్తు చేశారు. రంగా చేసిన సేవలకు గుర్తించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగా గారి పేరు పెట్టారన్నారు. ఎన్జీరంగాకు శ్రీకాకుళంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. రంగా శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచారన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించి నాణ్యమైన ఉత్పత్తులు పండించేలా యూనివర్సిటీ అధికారులు రైతులను సిద్దం చెయ్యాలని సూచించారు. నేటి రోజుల్లో ప్రజాప్రతినిధులపై ప్రజలకు రోజురోజుకూ అంచనాలు తగ్గిపోతున్నాయని నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. నేటి రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడకపోవడం, బూతులు మాట్లాడకుండా ఉంటే చాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్జీరంగా వంటి నేతలు కేవలం విషయాలపై మాట్లాడి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆయ స్పూర్తితో నేటి రాజకీయ నాయకులు పనిచేస్తూ ప్రజలకు మేలు చెయ్యాలన్నారు. రైతులకు ఎలా మేలు చెయ్యాలో శాస్త్రవేత్తలు ఆలోచించాలని సూచించారు. రైతులు చేసే అన్ని పనులు ఏఐ చెయ్యలేదన్నారు. రైతులసంక్షేమం కోసం ప్రభుత్వంతోపాటు శాస్త్రవేత్తలు కూడా పనిచెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రైతులకు ఆధునీక సాగు పద్దతుల ద్వారా ఆదాయాన్న పెంచే అవకాశాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలన్నారు.