Gudivada Amarnath Counter To TDP Referendum: ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రెఫరెండం అవుతాయని టీడీపీ రెఫరెండం డిమాండ్‌కు గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం.. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని, ప్రజలు తమకు ఐదేళ్లకు తీర్పు ఇచ్చారని, అలాంటప్పుడు తామెందుకు అసెంబ్లీ రద్దు చేయాలని ప్రశ్నించారు. ఎవరికైనా గెలవడానికి తాపత్రయం ఉండాలని, కానీ చంద్రబాబుకు ఓడిపోవడానికి తాపత్రయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు కుప్పంలో ఎలా గెలవాలో చంద్రబాబు చూసుకుంటే మంచిదని హెచ్చరించారు. ఎందుకంటే.. తాము రాష్ట్రంలో గెలిచే మొదటి స్థానమే కుప్పమని అన్నారు. సభకు రానని చంద్రబాబు మంగమ్మ శపథాలు చేస్తారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారని చెప్పారు. చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వినడం లేదో.. లేక వాళ్ల మాట చంద్రబాబు వినడం లేదో అర్థం కావడం లేదని సరికొత్త అనుమానాన్ని లేవనెత్తారు గుడివాడ అమర్నాథ్.
కాగా.. సీఎం వైఎస్ జగన్‌కు దమ్ముంటే, అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీఎల్పీ సమావేశంలో భాగంగా టీడీపీ సవాల్ విసిరింది. అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని, మూడు రాజధానుల రిఫరెండంగా తీసుకొని జగన్ ఎన్నికలకు వెళ్లాలన్నారని టీడీఎల్పీ నేత నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా చెప్పారు. మూడు ముక్కల రాజధానిపై జగన్‌కు నమ్మకముంటే, అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ అమర్నాథ్ పై విధంగా స్పందించారు.