ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన జీవనది గోదావరి… రాష్ట్రాలు దాటుకుని సముద్రం వైపు దూసుకుపోతుంది గోదారమ్మ. అయితే, ఎక్కువ భాగం వరద నీరు సముద్రం పాలు కావడంతో రైతులు, పర్యావరణ వేత్తలు, గోదావరి జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో నుండి వచ్చిన గోదావరి వరద నీరు వచ్చింది కొండంత. అయితే వినియోగించుకున్నది గోరంత…ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 3 టీఎంసీల నీరు మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉండటంతో 5,397 టిఎంసిలు వరదనీరు వృధాగా సముద్రంలోకి వదిలారు.వినియోగించుకున్నది మాత్రం 81 టీఎంసీలే.వృధాగా పోతున్న గోదావరి జలాలపై స్పెషల్ రిపోర్ట్.
Read Also: Karnataka: గంజాయి స్మగ్లర్ల దాడి.. చావుబతుకుల మధ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్
ఈ ఏడాది వరద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. మూడుసార్లు వరదలు వచ్చి ఉప్పొంగి ప్రవహించింది. రోజులు తరబడి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగింది. జూలై ఆరంభం నుంచి ఈ వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బ్యారేజి గేట్లను దించడానికి ఏ రోజూ అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితులలో సముద్రంలోకి ఎంత నీరు వృధాగా వెళ్ళిందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. జలవనరులు శాఖ అధికారులు లెక్కల ప్రకారం జులై 1 నుంచి ఇప్పటివరకు ఐదువేల 397 టీఎంసీలు వరదనీరు వృధాగా సముద్రంలో కలిసిపోయింది.
ఇది నదీ జలాలను వినియోగించుకోవాలనే ఆశయాన్ని వెక్కిరిస్తుంది. ఇంత నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా మరి మనం ఎంత నీటిని వాడుకున్నాం అన్నది లెక్క చూసుకుంటే తూర్పు, పశ్చిమ, మధ్యమ డెల్టాల పంట కాలువల ద్వారా వాడుకున్నది కేవలం 81 టీఎంసీలు మాత్రమే. ఇప్పుడు కూడా ధవళేశ్వరం బ్యారేజి వద్ద పది అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం కాలువలకు రోజుకు 12వేల 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంటే సముద్రంలోకి 5 లక్షల 40 వేల 191 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి కావాల్సి ఉంది.
Read Also: CM KCR: పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి.. అవార్డులు రావడంపై సీఎం హర్షం
పోలవరం ప్రాజెక్టు ద్వారా వరదనీటి కెనాల్స్ ద్వారా దారి మళ్ళించి వృధా పోతున్న గోదావరి వరద నీటిని ఒడిసి పట్టుకుని వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఆ దిశగా మన పాలకులు కార్యాచరణ వేగవంతం చేయాల్సిన అవసరం వుంది. ఈ వృధానీటిని వాడుకుంటే మన పొలాలు సస్యశ్యామలం అయి విలువైన పంటలు పండుతాయంటున్నారు. (రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ సౌజన్యంతో….)