Global Investors Summit: పారిశ్రామిక దిగ్గజాల చూపు.. ఇప్పుడు విశాఖపై పడింది.. విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)ను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేటి నుంచి రెండు రోజుల పాటు జగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వచ్చే అతిథులను ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది సర్కార్. పారిశ్రామిక వేత్తల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు పరిశ్రమలు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‍కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్‌లు తరలిరానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సమ్మిట్ కోసం 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే.. పారిశ్రామిక వర్గాల నుంచి స్పందన ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Also: WhatsApp Group: వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని.. వ్యక్తిపై కాల్పులు
ఇక, జీఐఎస్‌లో తొలిరోజు కార్యక్రమాల విషయానికి వస్తే.. ఇవాళ ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమంతో సదస్సు ప్రారంభం కానుంది. రేజర్ షో, మా తెలుగు తల్లికి.. గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం నాఫ్ సీఈఓ సుమిత్ బిదాని, భారత్ ఎఫ్‌ఐహెచ్ లిమిటెడ్ కంట్రీ హెడ్ అండ్ ఎండీ జోష్ ఫాల్గర్, టొరే ఇండస్ట్రీస్(ఇండియా)ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసహీరో హమగుచి, కియా ఇండియా నుంచి కబ్ డోంగి లీ, ది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతిరెడ్డి, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, సెంచురీ ఫ్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజంకా, టెస్లా ఇంక్ కో ఫౌండర్ అండ్ మాజీ సీఈఓ మార్టిన్ ఎబర్‌హార్డ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ అనంతరం జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.ఎం.రావు, సయింట్ ఫౌండర్ చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్లా, దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా, రెనూ పవర్ సీఎండీ సుమంత్ సిన్హా ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్, సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్, అదాని పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదాని, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కె.ఎం.బిర్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముఖేష్ అంబాని ప్రసంగిస్తారు. అనంతరం ఎంఓయూ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరి కీలక ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం ప్రముఖులను సన్మానిస్తారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ వందన సమర్పణ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది..
మధ్యాహ్నం 3 గంటల నుంచి నాలుగు ఆడిటోరియాల్లో వివిధ విభాగాలకు సంబంధించిన సెషన్స్ జరగనున్నాయి. ఆడిటోరియం 1లో ఐటీ, 2లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 3లో రెనెవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, 4లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీ సెషన్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆడిటోరియం 1లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, 2లో స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, 3లో హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్‌మెంట్, 4లో ది నెదర్లాండ్స్ కంట్రీ సెషన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఆడిటోరియం 1లో ఎల్రక్టానిక్స్, 2లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, 3లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, 4లో ట్రాన్స్‌ఫర్మేటివ్ ఫుడ్ సిస్టమ్స్‌పై ప్రత్యేక హైలెవెల్ సెషన్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలిరోజు సదస్సు ముగుస్తుంది.. పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు విశాఖకు తరలిరావడంతో.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది పోలీసులు యంత్రాంగం.. 2,500 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రధాన వేదిక ప్రాంగణం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని సీపీ తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వీఐపీలు బస చేసే హోటల్స్, ప్రయాణించే మార్గాలు అన్నీ పూర్తి స్థాయి భద్రతలో ఉంటాయన్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రులను ఎయిర్‌పోర్ట్ నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. పారిశ్రామిక దిగ్గజాలను దృష్టిలో పెట్టుకుని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా వీఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలను విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.