WhatsApp Group: ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం, దారుణంగా వ్యవహరించడం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న విషయాలకే నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురిచేస్తోంది. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లో కుక్కల మరణంపై మాటల యుద్ధం తర్వాత పెంపుడు జంతువుల యజమానుల వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించబడిన ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి గాయపరిచారని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన ఫిబ్రవరి 26న జరిగింది. రాజ్‌కమల్ అనే బాధితుడి చేతికి, కడుపులో గాయాలయ్యాయి.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.నిందితులను జావెలిన్ త్రోయర్ హితేష్ అలియాస్ డేవిడ్ (23), నోయిడాలో టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆనంద్ కుమార్ (26), టోల్ ప్లాజా ఉద్యోగి భూపేందర్ అలియాస్ భీమ్ (30)గా గుర్తించారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు రెండు కాట్రిడ్జ్‌లు, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: US Warns China: బీజింగ్ రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే.. చైనాకు అమెరికా హెచ్చరిక
ఒక నెల క్రితం ఆనంద్ కుమార్ కుక్క డాగ్‌ఫైటింగ్ సమయంలో చనిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని వ్యంగ్య సందేశాలు షేర్ చేయబడ్డాయి. దాని వల్ల మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత రాజ్‌కమల్ ఆనంద్‌కుమార్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. దీంతో ఆనంద్ రాజ్‌కమల్‌పై పగ పెంచుకున్నాడు. ఫిబ్రవరి 26న, వారు బస్పదంక గ్రామంలో కలుసుకున్నప్పుడు, నిందితులు రాజ్‌కమల్‌ను కాల్చారు. బుల్లెట్ రాజ్‌కమల్ చేతికి, కడుపులో తాకిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పటౌడీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.