ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.
అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా బందుకు టీడీపీ పిలుపునిస్తే పెద్ద ఎత్తున పోలీసులతో హౌస్ అరెస్ట్ లు చేసి అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగిన దాడిని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. పోలీసులను అడ్డుపెట్టు కొని ఈ ప్రభుత్వం పిరికిపంది చర్య లు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు మందు పోయించి టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై దాడి చేయించారన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీడీపీ నేతల అరెస్టులతో రాష్ట్రం వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు వైసీపీ శ్రేణులు సైతం టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ముందుకు తెస్తూ.. నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు వైసీపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.