తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులులు, పులులు, ఎలుగుబంట్లు… ఇలా వన్యప్రాణులు గ్రామాల మీద పడుతున్నాయి. జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కోనసీమ, అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల దాడితో జనం బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామంలోకి చొరబడి ఏనుగుల గుంపు నానా బీభత్సం సృష్టించింది. ఏనుగులు చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. గ్రామంలోనే కాసేపు ఉండడంతో భయాందోళనతో పరుగులు తీశారు గ్రామస్తులు.
గ్రామంలోకి వచ్చిన ఏనుగులు దొరికిన వస్తువుల్ని దొరికినట్టు నాశనం చేశాయి. గ్రామంలో రేకుల షెడ్లను, మోటారు బైక్లను ధ్వంసం చేసిన ఏనుగులు అడ్డొచ్చిన వాటిపై తమ ప్రతాపం చూపాయి. గ్రామ సమీపంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో చొరబడి అక్కడి సామాగ్రిని చెల్లాచెదురు చేశాయి ఏనుగులు. దీంతో భయంగుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు జనం. అనంతరం ఏమీ తెలియనట్టుగా ఏనుగులు గ్రామ బయట చెరువులో జలకాలాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించడం విశేషం.

మళ్ళీ ఈ గజరాజులు ఎప్పుడు తమ గ్రామంపై పడతాయోనని జనం ఉలిక్కిపడుతున్నారు. ఇటు చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల ప్రజలు కూడా ఏనుగుల దెబ్బకు అల్లాడిపోతున్నారు. పంటలు పాడుచేయడం, జనంపై దాడి చేస్తుండడంతో గ్రామాల్లో, వ్యవసాయక్షేత్రాల్లో పనిచేయడానికి వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు గజరాజుల నుంచి తమను, తమ పంటల్ని, ఆస్తుల్ని రక్షించాలని వేడుకుంటున్నారు.

Read Also: Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య హత్య.. రిమాండ్ రిపోర్టులో ఏ1 పేరు మాయం..!