ఆ ఆలయానికి కోట్ల విలువ చేసే ఆస్తులున్నా.. స్వామివారి కల్యాణానికి చందాలే దిక్కా? ఆరు మండలాల్లోని పంచాయతీల నుంచి ఎందుకు వసూళ్లు చేపట్టారు? వందల ఎకరాల ఆలయ భూములు ఏమయ్యాయి? దేవుడు సొమ్ముకు లెక్కలు చెప్పేవాళ్లే లేరా? స్వామివారికి శఠగోపం పెడుతున్నదెవరు?
స్వామి కల్యాణానికి చందాలా?
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. దేశంలోనే ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొకటి. ఏటా స్వామివారి కల్యాణోత్సవానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు.. ఖరీదైన ఆస్తులు ఆలయానికి ఉన్నాయి. కానీ.. స్వామివారి కల్యాణానికి చందాలకు చేతులు ఎత్తాల్సిన పరిస్థితే అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ స్థితి ఎందుకొచ్చింది? ఆలయ పరిసరాల్లో ఆక్వా సాగు యథేచ్ఛగా సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.
పంచాయతీల నుంచి రూ. 20-30 వేలు వసూలు?
పల్లవ రాజులు 5వ శతాబ్దంలో అంతర్వేది ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 2004లో ఆలయ ఆధునికీకరణ జరిగింది. నవ నారసింహ క్షేత్రాల్లో అంతర్వేది ఒకటి. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో పర్యాటకంగానూ అంతర్వేదికి ప్రాధాన్యం ఉంది. ఆలయానికి ఉన్న ఆదాయ వనరులకు తగ్గట్టుగా అభివృద్ధి జరగలేదనేది భక్తుల వాదన. అత్యంత విలువైన భూములు ఉన్నప్పటికీ.. ఆదాయం తక్కువే. పైగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం పేరుతో ఎటా పంచాయతీల నుంచి వసూళ్లు చేస్తుంటారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట మండలాలలో 32 మెజర్ పంచాయతీలు.. 75 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ పంచాయతీల నుంచి 30వేలు చొప్పున, మైనర్ పంచాయతీల నుంచి 20వేల రూపాయలు చొప్పున వసూళ్లు కామన్. రాజోలు, మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి, పి.గన్నవరం ఈ ఐదు మండల పరిషత్‌ల నుంచి 3 లక్షల చొప్పున వసూలు చేశారట. ఆలయానికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నా.. హుండీల ద్వారా, దాతల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ఇలా వసూళ్లుకు దిగడం విమర్శలకు తావిస్తోంది. అయితే కల్యాణానికి తామెలాంటి వసూళ్లకు పాల్పడట్లేదనేది దేవాదాయ శాఖ అధికారుల వాదన. పంచాయతీరాజ్ వసూళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
ఆలయం బయట ఏర్పాట్లు తమవే అంటోన్న పంచాయతీరాజ్‌శాఖ?
కల్యాణోత్సవాలకు సహకరించడం ఎప్పటి నుంచో ఉన్నదేనన్నది పంచాయతీరాజ్ శాఖ వాదన. బారికేడ్లు, చెరువుల చుట్టూ లైటింగ్.. స్నానఘట్టాల దగ్గర వసతుల కల్పన తమ పరిధిలోకే వస్తుందని గట్టిగానే చెబుతున్నారు పంచాయతీ రాజ్ అధికారులు. అయితే వీటికి లెక్కా పత్రం ఉంటుందా అంటే అనుమానమే అన్నది భక్తుల మాట. ఇక ఆలయానికి 900 ఎకరాల భూములు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని దాదాపు 32 గ్రామాల్లో మెరక 416 ఎకరాలు.. పల్లం 476 ఎకరాలు ఉన్నాయి. ఒకప్పుడు చక్కగా వరిసాగు ఇతర పంటలు వేసిన ఈ భూముల్లో ప్రస్తుతం చేపలు, రొయ్యల చెరువులు కనిపిస్తున్నాయి.
లోకాయుక్త ఆదేశాలనూ పట్టించుకోని పంచాయతీరాజ్ శాఖ
చాలా వరకు భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. లోకాయుక్త వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆలయ భూముల్లో శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. వాటిని తొలగించాలని లోకాయుక్త ఆదేశించినా పంచాయతీరాజ్ పట్టించుకోలేదు. భూముల లీజు ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఆలయానికి రావాల్సి ఉన్నా.. అలా జరగదు. నేటికీ ఎకరాకు రెండొందలు లేదా మూడొందల చొప్పునే లీజుకు ఇస్తున్నారు. అన్నీ పెద్దల చేతుల్లో ఉన్నవే. కొందరు కులాల వారీగా సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఆలయ భూముల్లో పాగా వేసేశారు. ప్రభుత్వ పెద్దలకు.. స్థానిక రాజకీయ నేతలకు ఈ విషయాలు తెలిసినా.. దేవుడికి కాకుండా తమకొచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి వీటిపై నోరు మెదపడం లేదు. లక్ష్మీపతికే శఠగోపం పెట్టేస్తున్నారు. పైగా స్వామివారి కల్యాణానికి వచ్చి.. మొదటి వరసలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వడం ఆ పెద్ద మనుషులకే చెల్లింది.
.