ఏపీపై బీజేపీ హైకమాండ్ ఆశలు వదిలేసుకుందా? తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఒక్కశాతం కూడా ఏపీకి ఎందుకు ఇవ్వడంలేదు? ఎంత చేసినా అక్కడ నుంచి అంతకు మించి వచ్చేది ఏమీలేదని డిసైడ్ అయ్యిందా? లేక పదవులు పొందేస్థాయి ఉన్న నేతలెవరూ లేరనా? పదవుల పందేరంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆరో వేలిలా చూస్తోంది అందుకేనా?
ఏపీ బీజేపీకి ఒకటి అరా పదవులే..!
ఏపీ బీజేపీ శాఖను ఆ పార్టీ హైకమాండ్ లైట్ తీసుకుంటున్నట్టుంది. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూస్తే అదే అర్ధం అవుతుంది. పక్కన ఉన్న తెలంగాణకు విపరీతమైన ప్రయార్టీ ఇస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. అదే సమయంలో ఏపీకి తూతూ మంత్రంగా ఒకటీ అరా పదవులు విదిలిస్తోంది.
జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఒక్కరికే చోటు..!
80 మంది సభ్యులతో జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ హైకమాండ్ మరో 50 మంది నేతలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పదవులు అప్పగించింది. ఈ రెండు పదవుల్లో ఏపీకి దక్కింది ఒక్కటంటే ఒక్కటే. అందులో కనీసం గతంలో ఉన్నట్టుగా ఇద్దరికి కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఏపీ నుంచి సోము వీర్రాజు, కంభంపాటి హరిబాబు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉండేవారు. హరిబాబు గవర్నర్‌గా వెళ్లారు. వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ ఇద్దరికి బదులు మరో ఇద్దరికి ఛాన్స్ వస్తుందని నిన్నటి వరకు నేతలు ఆశించారు.
తెలంగాణ నుంచి ఒకేసారి నలుగురికి చోటు..!
బీజేపీ హైకమాండ్… కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరినే జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. ఏపీ నుంచే కామర్సు బాలసుబ్రహ్మణ్యాన్ని పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీగా చోటు ఇచ్చినా… ఆయన ఎప్పుడూ రాష్ట్ర పార్టీ కార్యకలాపాల్లో ఉండరు. ఆయనదంతా ఢిల్లీ లెవల్. అదే సమయంలో తెలంగాణలో ఒకేసారి నలుగురికి కార్యవర్గంలోకి చోటుకల్పించింది. అంతేకాదు.. విజయశాంతికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం ఇచ్చారు. అంతకు ముందు కూడా డి.కె. అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా పదవి ఇస్తే… ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ ను నియమించారు. అప్పుడు పురందేశ్వరిని ఏపీ నుంచి ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. సత్యకుమార్‌ను జాతీయ కార్యదర్శిని చేశారు.
ఏపీలో టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలకు హ్యాండిచ్చారు..!
టీడీపీ అధికారం కోల్పోగానే జెండా తీప్పేసిన ఎంపీలు సుజనా చౌదరి, టి.జి. వెంకటేష్, సి.ఎం. రమేష్‌లకు ఏ పదవీ ఇవ్వట్లేదు. వాళ్లు పార్టీని పట్టించుకోవడం లేదో… వాళ్లనే పార్టీ లైట్ తీసుకుందో ఏమో కానీ.. మాజీ ఎంపి అయిన గరికపాటి రామ్మోహనరావుకు జాతీయ కార్యవర్గంలో చోటిచ్చింది. ఏపీలో ఎంపీలుగా ఉన్న ఈ ముగ్గురికీ అవకాశం ఇవ్వలేదు. పేరుకు యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా… కార్యకలాపాలన్నీ ఏపీ నుంచి నిర్వహిస్తున్న జీవీఎల్ నరసింహారావుకు ఉన్న జాతీయ అధికార ప్రతినిధి హోదానూ పీకేశారు.
పదవులు చేపట్టేంత స్థాయి ఉన్న నేతలు ఏపీలో లేరా?
ఏపీలో ఎంత చేసినా… ఎన్ని పదవులు ఇచ్చినా ఎదుగూబొదుగూ ఉండదనే హైకమాండ్ పట్టించుకోవడం లేదట. జాతీయ పార్టీలో పదవులు చేపట్టేంత స్ట్రేచర్ ఉన్నోళ్లు కూడా మా రాష్ట్రంలో ఉండాలి కదా? అని సెటైర్ వేశారు ఓ నాయకుడు. ఇంకో నాయకుడు అయితే… హైకమాండ్ చేసిన దాంట్లో తప్పేమీలేదని తేల్చేశారు. మరి పార్టీ నాయకత్వం అంతా అదే ఫీల్ లో ఉందో ఏమో… మాకెందుకు పదవులు ఇవ్వడం లేదు అని గొంతు విప్పలేకపోతున్నారు.