ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత కలిగిన సీఎం. ఈ విషయాన్ని నేను కాదనడం లేదు అనేశారు. తాజాగా అసంతృప్తికి తావిచ్చే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. కరవంజ గ్రామంలో ఆయన మాట్లాడారు. తాను మంత్రిగా త్వరలో దిగిపోతున్నానని, తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు మంత్రి అవుతాడన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత నేను జగన్ వెంట నడిచాను. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశాను.
అప్పట్లో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నాడు. నరసన్నపేట ఉప ఎన్నికలో నాపై మరో సోదరుడు రామదాసును బరిలో దించాడు. ఆ ధర్మయుద్ధంలో నేనే గెలిచాను. అటు తర్వాత 2019 ఎన్నికల్లో మా తమ్ముడు వైసీపీ నుంచి పోటీ చేశాడు. ఇద్దరం గెలిచాం. జగన్ నన్ను గుర్తించి మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. ఈ మూడేళ్లూ నా సోదరుడు ఖాళీగా ఉండిపోయాడు. రేపో మాపో మంత్రి అవుతాడు’.. అని కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. చివరగా.. ఎవరు మంత్రిగా ఉన్నా తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పినా.. ఆయన మాటల్లో అసంతృప్తి మాత్రం బయటపడింది. జగన్ మంత్రివర్గంలో ఎవరికి బెర్త్ దొరుకుతుందో తెలీదు గానీ ఇప్పుడు మంత్రి పదవిలో వున్నవారు మాత్రం ఏదో ఒక వేదికగా తమ అసహనం వ్యక్తం చేస్తూనే వున్నారు.