ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందన్నారు.. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకుని రావాలని చూడ్డం శోచనీయమన్న ఆమె.. వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకుని అప్పులకు వెళ్తున్నారని విమర్శించారు.. ఉన్న ఆస్తులను అమ్ముకోవడం చూస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని అర్ధం అవుతోందన్న ఆమె.. ఇప్పటికే ఆరు లక్షల పై చీలుక అప్పు భారం ప్రజలపై పడిందన్నారు.
Read Also: Harish Rao: 3 రోజుల పాటు పోలియో చుక్కలు..
కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా ఎక్కువ అప్పులు-తక్కువ అభివృద్ధిగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధిలోనూ కేంద్ర భాగస్వామ్యం ఖచ్చితంగా ఉందన్న ఆమె.. కేంద్రం వనరులు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎంపీకే రక్షణ లేకుండాపోయిందన్న ఆమె.. రాష్ట్ర రహదారులపై గుప్పెడు మట్టి కూడా ఈ ప్రభుత్వం వేయలేకపోతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదనేది నిజం కాదని స్పష్టం చేశారు. కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అభివృద్ధి కంటే అప్పులు తీసుకుని రావడానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు పురంధేశ్వరి.