ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు.
అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై శాసనసభలో చర్చించాలని ఆయన కోరారు. కాగా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతుందని.. మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉందని ఇప్పటికే పలువురు మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.