రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వైఖరేంటి? అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయి… కానీ, టీడీపీ, వైసీపీల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో లౌకిక వాదానికి పెను ప్రమాదం సంభవించిందన్న ఆయన.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోడీ పాలన సాగిస్తున్నారు.. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ మద్దతు ఇవ్వాలని సూచించారు. ఇటీవల మోడీని కలిసిన వైఎస్ జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోందని.. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అని జగన్ హామీ ఇచ్చారని.. 2014 ఎన్నికలలో ఓడినప్పటి నుండి 2019 ఎన్నికల వరకు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పింది వాస్తవం కాదా..? అని నిలదీశారు.
Read Also: Janasena: ఉద్రిక్తత.. వల్లభనేని వంశీని అడ్డుకున్న జనసేన శ్రేణులు..!
ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక కోసం వైఎస్ జగన్ అవసరం వాళ్లకి ఉంది.. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తానని జగన్ ఎందుకు చెప్పడం లేదు..? అని ప్రశ్నించారు రామకృష్ణ.. మెడలు వంచుతా అన్న వాడివి.. నోరెందుకు విప్పవు..? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు సమావేశానికి హ్యాండ్ ఇచ్చావు.. మెడలు వంచడం కాదు.. నువ్వే మోకాలు వంచుతున్నావు అని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వంత పాడుతున్నావు.. జగన్‌ను నమ్మి గెలిపిస్తే.. నీ స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేస్తున్నావు అని మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేసిన రామకృష్ణ.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ మోసం చేశారని ఆరోపించారు. మొక్కుబడిగా కొంత మందికే పంట నష్టం ఇచ్చి చేతులు దులుపుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా చేస్తే.. టోల్ ఫ్రీ నెంబర్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు..? జగన్ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తుంది.. డ్రిప్ వేసుకోకుండా సబ్సిడీ తొలగించారు.. మోడీ, జగన్ లు సిగ్గుతో తల దించుకోవాలి.. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కోనసీమ, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో క్రాప్ హాలిడే అంటున్నారు.. సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి సమస్య పరిష్కరించరా..? అని నిలదీశారు రామకృష్ణ.. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకి ఎందుకు రావడం లేదు అని జగన్‌పై సెటైర్లు వేసిన ఆయన.. గత ప్రభుత్వంపై నిందలేసి ఓట్లు వేయించుకున్నారు.. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.. రెండు రూపాయలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు సీపీఐ నేత రామకృష్ణ.