మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇక, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన వారిపైన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.. రోజుకి వెయ్యికోట్లు సంపాదించడానికి ఆదానీ ఏమైనా మాయల పకీరా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోవాలన్నారు. మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ దందా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన నారాయణ.. అందులో కొంత మంది సినిమా వాళ్లు ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్ల వెంటబడి డబ్బులు గుంజుకునే బదులు.. అసలు దోషులను పట్టుకోవాలని సూచించారు. ఆదాని వంటి వాళ్ళ ప్రయేయం వున్న తర్వాత ఎన్ని సిట్ లు వేసినా ఫలితం ఉండదన్న ఆయన.. ఆదాని కేంద్ర ప్రభుత్వానికి దత్తపుత్రుడు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్రానికి దాసోహం అయిపోయారు అంటూ ఆరోపించారు సీపీఐ నేత నారాయణ.