Baby Dead Body on Scooty: పండంటి కూతుర్ని కాపాడుకోవాలన్న ఆ దంపతులు ఆశ తీరలేదు. కంటిపాప కన్నుమూసిందని దుఃఖంలో ఉంటే , ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ అడిగితే మానవత్వం లేకుండా తిరస్కరించారు. మరోదారి లేక ద్విచక్ర వాహనంపై బిడ్డ శవాన్ని మధ్యలో కూర్చో బెట్టుకుని, ఒకట్రెండు కాదు ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ అమానవీయ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుందామని అనుకున్న తల్లిదండ్రులకు, తాము అనుభవిస్తున్న కష్టం కంటే.. కేజీహెచ్‌లో ఎదురైన నిర్లక్ష్యం తీరని వేదనను మిగిలించింది. అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరుకు చేరుకున్న బాధితులు, జరిగిన ఘోరం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
Read Also: Astrology : ఫిబ్రవరి 17, శుక్రవారం దినఫలాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా, కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, మత్య కొండబాబు దంపతులకు ఈనెల 2న నవజాత శిశువు జన్మించింది. బిడ్డకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించిన పాడేరు ఆ సుపత్రి వైద్యులు మెరుగైన సేవలు కోసం కేజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఎన్‌ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 7 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డెత్ నిర్ధారించిన వైద్యులు ఆ మేరకు నిర్ధారణ పత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖకు సుమారు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుముడ గ్రామానికి, చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించగా తీవ్ర నిర్లక్ష్యం ఎదురైంది. గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒకవైపు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం, సుదూరం వెళ్లాలనే తొందరపాటుతో తల్లిదండ్రులు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారు. తాము బిడ్డను తీసుకుని వచ్చిన టూవీలర్ పైనే, మధ్యలో మృతదేహం పెట్టుకుని ప్రయాణం ప్రారంభించారు. చిన్నారి మృత దేహంతో కేజీహెచ్ కాంపౌండ్ దాటుకుని.. తల్లిదండ్రులు మోసుకునిపోతున్నా పట్టించుకునే దిక్కు లేకపోయింది.
అయితే, ఈ అమానవీయ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయని కేజీహెచ్ లో చోటు చేసుకుంటున్న దారుణాలను కళ్ళకు కట్టింది. బాధ్యత వహించాల్సిన యంత్రాంగం ఒకరినినొకరు నిందించుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు నిధులు ఖర్చు చేస్తున్నాయి. కానీ, సిబ్బంది నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఉదాసీన వైఖరి దారుణాలకు కారణంగా నిలుస్తోంది. అంబులెన్స్ కూడా సమకూర్చకుండా తీరని వేదనకు గురిచేసిన తీరుపై రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. వైద్యశాఖ సిబ్బంది దుర్మార్గంపై మండిపడుతున్నాయి.