దేశంలో హడలెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్టేనా? అవునంటున్నారు నిపుణులు. అయితే, కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవంటున్నారు. కరోనా ముగిసినా కరోనా అనంతర పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు నిపుణులు. నిద్రలేమి, అలసట, డయాబెటీస్ నుంచి డిప్రెషన్ వరకు.. కొత్త సమస్యలుగా మారుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చినా ఈసారి అంతగా సీరియస్ కేసులు లేవనే చెప్పాలి. చాలామంది ఇంటిలో ఉండి వైద్యం తీసుకుని కోలుకున్నారు. కరోనా తగ్గిన తరవాత కొన్ని ఆరోగ్యపరమయిన ఇబ్బందుల వల్ల ఆసుపత్రులకు వెళుతున్నారు. కొంతమంది ఆయాసం, నీరసంతో ఇబ్బంది పడుతున్నారు. వాకింగ్ చేద్దామంటే ఓపిక వుండడం లేదని చెబుతున్నారు.
కరోనా తగ్గిన తర్వాత కూడా ఖచ్చితమైన కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు. అందుకే ఈసారి ఓమిక్రాన్ కావచ్చు.. డెల్టా కావచ్చు… పాజిటివ్ లో కంటే నెగిటివ్ లోనే ఇబ్బందులు ఎక్కువగా వున్నాయంటున్నారు. కొందరు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా కరోనా తొలిదశ టైంలో లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. చాలామంది వాసన, రుచి కూడా కోల్పోయారు. న్యూరాలజీ విభాగంలో వింత కేసులు పోస్టు కోవిడ్ కేసుల్లో బయటపడుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.