ఏపీలో పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆకాంక్షించారు. విద్యుత్ సరఫరా విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏపీలో సీనియర్ మంత్రులకు భయపడి జగన్ పరిపాలన చేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. ఏపీలో అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పిల్లకూతలు ఆపాలని.. కేసీఆర్ కుటుంబం గతంలో సోనియా గాంధీ కాళ్లపై పడిన విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి ఏం లేదని హర్షకుమార్ విమర్శించారు.