ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వుంది. పార్టీలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. ఎన్నికలకు ముందే పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు వున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో తన వైఖరి చెప్పేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పొత్తులు తప్పవనే సంకేతాలు క్లియర్ గా ఇవ్వడంతో పొత్తుపొడుపులు పొడుస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో, ఎప్పుడు విడిపోతుందో చెప్పలేం. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరంటారు.
రాజకీయల్లో పొత్తులు సహజమని చెప్పటం ద్వారా తాము పొత్తులు పెట్టుకోబోతున్న విషయాన్ని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పవన్ సైతం ప్రభుత్వ ఓటు చీల్చమని మరోసారి చెప్పటం ..అదే సమయంలో టీడీపీ ముందుకొస్తే పొత్తుల గురించి మాట్లాడుతానని స్పష్టం చేసారు. అయితే, అదే సమయంలో బీజేపీ ఏపీ చీఫ్ టీడీపీతో పొత్తు ఉండదని..తమకు జనంతోనే పొత్తు ఉంటుందని..అవసరమైతే జనసేనతో ఉంటుందని చెప్పడం ద్వారా పొత్తు గురించిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. అలాగైతే మరి జనసేన అటు టీడీపీతో, ఇటు బీజేపీతో కలిసి రెండు పడవల ప్రయాణం ఎలా సాగిస్తుందనది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది.
ఎవరు ఎవరితో కలిసి నడవాలనేది ఆయాపార్టీల వ్యక్తిగత ఇష్టం. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టీడీపీకి విశ్వాసం లేదని, అందుకే ఇప్పుడే పొత్తుల ప్రస్తావన తీసుకొస్తున్నారని విమర్శించింది. చంద్రబాబు ఒక్కరే వచ్చినా, అందర్నీ కలుపుకొని వచ్చినా, మళ్లీ వైసీపీదే గెలుపు అనే ధీమాతో వున్నారు. పొత్తులు లేకుండా సింగిల్‌గా పోటీచేసిన చరిత్ర చంద్రబాబుకి లేదంటూ దెప్పిపొడుస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయమని మంత్రులు తెగేసి చెబుతున్నారు. వైసీపీ నేతలు పదే పదే టీడీపీ -జనసేన కలిసే ఉన్నాయని..కలిసే పోటీ చేస్తాయంటూ ప్రచారం చేసారు. దమ్ముంటే సింగిల్ లో పోటీ చేయాలంటే మైండ్ గేమ్ ప్రారంభించారు. సింహం సింగిల్‌గా వస్తుందని.. సినిమా టిక్ డైలాగులు వల్లిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు ఒక్కరే వచ్చినా, తాము మాత్రం మళ్లీ గెలుస్తామని, గెలిచే సీట్ల సంఖ్యలో కూడా ఎలాంటి తేడా వుండదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ధీమా తో వున్నారు. మాదంతా సోలో ఫైట్ అని ప్రకటించారు. మరో 25 ఏళ్ళపాటు ఏపీకి జగనే సీఎం అని ప్రకటించారు.
2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలవటం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు జనసేన -టీడీపీ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా మారనుంది. బీజేపీతో వీరితో కలవకపోయినా వచ్చే నష్టం లేదంటున్నారు. 2024లో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బల్లగుద్ది మరీ చెబుతున్నా.. వాస్తవిక పరిస్థితులు వేరుగా వున్నాయి. అది వారికి తెలియనివి కావు. కేంద్ర నాయకత్వం మాత్రం టీడీపీతో కలవడానికి అంతగా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. 2014 నాటి పరిస్థితులు వేరు.. 2023-24 నాటి పరిస్థితులు వేరుగా వుంటాయి. మీ త్యాగాలను చాలా సార్లు గమనించామని, మీకో దండమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ త్యాగాలను గమనించడానికి ఏపీ బీజేపీ ఏమాత్రం సంసిద్ధంగా లేదని సోము వీర్రాజు తేల్చి చెప్పారు. త్యాగధనులు ఈ వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలని బీజేపీ చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
తాజాగా అనంతపురంలో సీపీఐ నేత రామకృష్ణ పొత్తులపై తమ వైఖరిని వెల్లడించారు. ప్రజా సమస్యలప్తె పోరాటానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి. ప్రజల కోసం అన్ని పార్టీలు కలిసి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాం. ముందస్తు ఎన్నికలు వస్తే పొత్తుల పై ఆలోచిస్తాం అన్నారు రామకృష్ణ. ఎవరి స్టాండ్ వారిదే. సింగిల్ గా రావాలా … వద్దా అని చెప్పడానికి వేరే పార్టీ వాళ్ళెవరు? పెట్రోల్, వంట గ్యాస్ పెంచిన బీజేపీతో కలుద్దామంటే జనం ఒప్పుకోరు. బీజేపీ, వైసీపీలు వేరువేరు అన్నారు రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా వైసీపీ సహకరిస్తోంది. ప్రధాని మోడీ ఆశీస్సులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు రామకృష్ణ. మొత్తం మీద ఏపీలో పొత్తు పొడుపులు.. దెప్పి పొడుపుల రాజకీయం నడుస్తోంది.