CM YS Jagan Review: అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి.. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం అయినట్టు అయ్యింది.. అయితే, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
Read Also: XBB 1.16 variant: భయపెడుతోన్న కొత్త వేరియంట్.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురియడంతో రైతులకు భారీగా పంటనష్టం జరిగింది.. దీంతో, లబో దిబో అంటున్నారు రైతులు.. ఇక, రానున్న మూడు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఈ రోజు ఉదయం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉందని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణశాఖ.