ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని.. జూలై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని.. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. గోదావరిలో వరద16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరదలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదన్నారు.
Read Also: AP-Telangana: ఏపీ, తెలంగాణలో జలాశయాలకు పోటెత్తుతున్న వరద.. గేట్ల ఎత్తివేత
కూనవరం, చింతూరుల్లో రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని.. కంట్రోల్ రూమ్స్ సమర్థవంతంగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. వీఆర్‌పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయన్నారు. లైన్ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అధికారులకు తెలిపారు. సహాయక శిబిరాల నుంచి బాధితులు ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలన్నారు. ఈ నగదు తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందన్నారు.
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కరెంట్ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, ఇరిగేషన్ కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు.