క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా క్లాప్ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు ఏపీ సీఎం జగన్. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలన్నారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వీలైనంత త్వరగా తెప్పించుకోవాలన్నారు.
గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే కాకుండా దుర్వాసన ఆ ప్రాంతంలో రాకుండా చర్యలు తీసుకోవాలి. గుంటూరులో వ్యర్థాలనుంచి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని సీఎంకు తెలిపారు అధికారులు. ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్లపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలని, గ్రామాల్లో డస్ట్‌బిన్స్ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్ ఇవ్వాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం పైనా నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం , క్రమం తప్పకుండా తాగునీటి వాటర్ ట్యాంక్‌లను పరిశుభ్రం చేయించాలి, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాలన్నారు. మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, క్లాప్ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ రూపంలో సమర్థులైన అధికారులను పెట్టాలని ఆదేశించారు. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు స్పందించి పరిష్కారించాలన్నారు.