CM Jagan Mohan Reddy Review Meeting On Tidco Houses: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల మీద విష ప్రచారం జరుగుతోందని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అధికారుల్ని సూచించారు. తమ ప్రభుత్వ హాయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టిందని, ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. మన టిడ్కో ఇళ్ళను మంచి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామన్నారు. ఈ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కాగా.. ఈ సందర్భంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చును, ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాల్ని అధికారులు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.28 కోట్లు చొప్పున.. హౌసింగ్ కోసం రూ.10,203 కోట్లు ఖర్చు అయినట్టు అధికారులు తెలిపారు. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు చెప్పారు. రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధంచేసినవి.. 4,67,551 ఇళ్లు ఉన్నాయని.. కొన్నిరోజుల్లో ఇవి పూర్తవుతాయని అన్నారు. కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న అధికారులు.. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
CM KCR: సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..? టాప్‌లో జగన్ మోహన్ రెడ్డి