అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు కొనుగోలు చేస్తుందన్నారు. అమూల్ అతిపెద్ద సహకార సంస్థ అని, పాల ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉందన్నారు.
Read Also: హాట్ కేకుల్లా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు… 40 నిమిషాల్లోనే ఫుల్
అమూల్ సంస్థ పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేస్తోందని సీఎం జగన్ తెలిపారు. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోందన్నారు. లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అమూల్ ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు గత ప్రభుత్వంపై సీఎం జగన్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని గత ప్రభుత్వం నీరు గార్చిందని ఆరోపించారు. తన పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించేవారని… వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు కూడా అంతకన్నా తక్కువకే కొనుగోలు చేసేవారని రైతులు చెప్పేవారని జగన్ అన్నారు. మినరల్ వాటర్‌కు ఇచ్చే రేటు కూడా పాలు పోసే రైతుకు ఇచ్చేవాళ్లు కాదన్నారు. గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అన్న పరిస్థితులు ఉండేవని… ఈ పరిస్థితిని మార్చడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని జగన్ తెలిపారు. ఆరు జిల్లాల్లో ఇప్పటికే పాల సేకరణను అమూల్ చేస్తోందన్నారు. ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, ప.గో, కృష్ణా జిల్లాల్లో పాలసేకరణ చేస్తోందని… అనంతపురం జిల్లాలోకి ఇవాళ అడుగు పెడుతున్నామని జగన్ వెల్లడించారు.
అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకూ అదనంగా ఇస్తున్నారని జగన్ చెప్పారు. రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీలను ఏర్పాటు చేస్తున్నామని, ఏఎంసీలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అమూల్ విస్తరించే కొద్దీ.. ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తామన్నారు. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు వేశారు, ఎంత ధర వస్తుందనే విషయాన్ని వెంటనే రశీదు కూడా ఇస్తారన్నారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్‌చేసే అవకాశం కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని జగన్ వెల్లడించారు.