ఏపీలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ అధికారులను వివరాలు కోరారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై సీఎం ఆరా తీశారు.
రాష్ట్రంలో కోవిడ్ 19 పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు అధికారులు. 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండు డోసులు దాదాపుగా పూర్తయ్యాయి. 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి 99.65శాతం వ్యాక్సినేషన్ అయింది. 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా రూ.5వేలు ఇవ్వాలని జగన్ ఆదేశాలు జారీచేశారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3వేలు కాగా, దీన్ని రూ.5వేలకు పెంచాలి. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలి. సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు తెస్తున్నట్టు జగన్ తెలిపారు.
ఆరోగ్యశ్రీలో 2,446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దీనిపై నిరంతర అధ్యయనం చేయాలని, అవసరాల మేరకు మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చవుతోంది. 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.35 కోట్లు, కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అధికారులు తెలిపారు. గత ఏడాది ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి అందింది రూ. 223 కోట్లు అని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.360 కోట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు పారదర్శకంగా వుండాలని జగన్ సూచించారు.ఆరోగ్య శ్రీ లోనూ డీబీటీ విధానాన్ని తీసుకుని రావాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇక నుంచి నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు చేరుతుంది. అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటో డెబిట్ విధానంలో చెల్లింపులు జరుగుతాయి. పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరిస్తారు. పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం వుంటుంది.
Viral Video : ఇదేం సినిమా కాదు.. రైలు బోగిలపై యువకుల స్టంట్స్..