Auto Driver Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో…’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనుంది. అయితే, ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రేపు ( అక్టోబర్ 4న) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. రేపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు.
Read Also: PVN Madhav: పెట్రోల్‌పై జీఎస్టీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించట్లే..
అయితే, 2.90 లక్షల మందికి లబ్ది చేకూరేలా ఏపీ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో సొంత ఆటో, క్యాబ్ లపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం రూ. 436 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇక, ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం కంటే.. అదనంగా రూ. 5 వేలను చంద్రబాబు సర్కార్ ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38, 576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20, 072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6, 400 మంది ఉన్నారు.
Read Also: Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. కోర్టులో విజయ్ పార్టీకి షాక్…
ఇక, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22, 955 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరగా.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే.. వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.