సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసమేతంగా తిరుమల విచ్చేశారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. మహాద్వారం వద్ద స్వాగతం పలికారు అధికారులు. అంతకుముందు శనివారం పద్మావతి అతిథి గృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం లభించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… జస్టిస్ ఎన్వీ రమణకు శాలువా కప్పి సత్కరించారు. సీజేఐకి స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ రాక నేపథ్యంలో పద్మావతి అతిథి గృహంలో పంచగవ్య ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సౌజన్యంతో టీటీడీ డ్రై ఫ్లవర్ సాంకేతికతతో రూపొందించిన తిరుమల వెంకన్న ఫొటోలు, పేపర్ వెయిట్లు, కీచైన్లతో ప్రత్యేక స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎన్వీ రమణ తిలకించారు. మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.