సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు.. సీజేఐ హోదాలో తన సొంత గ్రామంలోనూ అడుగుకుపెట్టారు.. ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తన పర్యటన ముగిసిన తర్వాత.. తన టూర్‌పై రాష్ట్ర ప్రజలకు బహిరంగలేఖ రాశారు జస్టిస్ ఎన్వీ రమణ.. ఏపీలో కాలు మోపినప్పటి నుంచి నాకు లభించిన ఆదరాభిమానాలు.. ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరును నేను నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువలేమన్న ఆయన.. బంధుత్వాలకంటే మిత్ర బంధానికే పెద్ద పీట పొన్నవరం.. ఊరు ఊరంతా నా కోసం తరలి వచ్చింది.. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని పేర్కొన్నారు.. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. తేనీటి విందుకు హాజరైన పెద్దలు, ప్రముఖులు, మంత్రులు, అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు జస్టిస్ రమణ..
ఇక, బెజవాడ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్, ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్ వంటి సంస్థలు నన్ను.. నా భార్యను సత్కారాలతో ముంచెత్తాయని లేఖలో పేర్కొన్నారు సీజేఐ.. లావు వెంకటేశ్వరరావు స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవానికి తోటి న్యాయమూర్తులు ఎంతో సంతోషించారన్నారు.. తన పర్యటన సాఫీగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ద చూపిన సీఎం, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. సమయాభావం వల్ల ఎంతో మందిని కలవలేకపోయాను.. మరోసారి కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.