సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి హడావిడిగా అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. సీఐడీ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి సత్యవతి బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు విడుదల చేశారు. ఆయనకు రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా అశోక్‌బాబును అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేకించిన ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడినందుకే అశోక్‌బాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బెయిల్ రాకుండా ఉండేందుకే అశోక్‌బాబుపై 467 సెక్షన్ కింద కేసు పెట్టారని.. దీనికి పదేళ్ల శిక్ష పడుతుందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులోవాదించారు.